రామప్పకు యునెస్కో గుర్తింపును పండగలా చేసుకోవాలి

రామప్పకు యునెస్కో గుర్తింపును పండగలా చేసుకోవాలి
  • రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్: రామప్ప కట్టడాన్ని యునెస్కో గుర్తించడం పట్ల రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇది చరిత్రలో మిగిలిపోయే రోజు అని.. దీన్ని పండుగలా సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణా అంటేనే గొప్ప సంస్కృతి, కట్టడాలు ఉన్న ప్రాంతం.. తెలంగాణ కట్టు, బొట్టు సంస్కృతం, సంప్రదాయాలు కాపాడుకోవడం గొప్ప విషయమని, కేసీఆర్ సారథ్యం లోనే పురాతన ఆలయాలకు అభివృద్ధి జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. 
‘‘రామప్ప కాకతీయుల అద్భుతమైన కట్టడం... నీళ్లలో తెలియడే ఇటుకలు, రాళ్లు ప్రత్యేకం... ఇంత గొప్ప అరుదైన కట్టడాన్ని ఎవరూ ప్రోత్సహించలేకపోయారు.. ఈ రోజు నుండి రామప్ప ప్రపంచ వారసత్వ సంపద.. ప్రపంచ పర్యాటక పటం లో కనిపిస్తది..కాకతీయుల కళా వైభవం చాలా గొప్పది... ఇది ఆ ఆలయం కట్టిన కూలీల,  రాజుల గొప్పతనం, వారికీ పాదాభివందనం... ఇప్పటికైనా యునెస్కో గుర్తించడం చాలా సంతోషం.. ఒకపుడు మన హైదరాబాద్ చాలా గొప్ప ప్రాంతం... రత్నాలు, వజ్రాలు, వైడుర్యలు గల ధనిక ప్రాంతం మనది.. రామప్ప గుడి, వరంగల్ ఫోర్ట్, వేయి స్థంబాల గుడి, చార్మినార్, గోల్కొండ కోట, వేయి ఊడల మర్రి, ఇవన్నీ మనం గర్వపడే ప్రాంతాలు... ఎన్నో దేశాలు కేవలం టూరిజం మీద ఆధార పడి బతుకుతున్నాయి... విదేశీయులు మన దేశానికి వస్తే, ఇక రామప్ప చూడకుండా అసలే వెళ్లరు... 70 పాలనలో మన చరిత్ర, మన సంపద మరుగున పడ్డది.. సమర్థవంతమైన సీఎం ఉన్నాడు కాబట్టి అన్నీ అనుకున్నట్టు జరుగుతున్నాయి.. వెలుగులోకి వస్తున్నాయి.. కొన్ని వందల ఏండ్ల క్రితమే ఒక గొప్ప వెలుగు వెలిగిన ప్రాంతం మనది.. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారు ప్రత్యేక చొరవ చూపారు.. అర్బన్ డెవలప్ మెంట్ తరుపున కృషి చేసారు... ఉమ్మడి ఏపీ లో ఏ గుర్తింపు, ఏ హోదాకు నోచుకోలేదు.. ఇండియాలోనే అతి గొప్ప శిల్ప కళా ఖండం, అరుదైన దేవాలయం మన రామప్ప... యునేస్కో వారికీ, విదేశీ రాయబారులకు కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ధన్యవాదాలు..’’ అన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. 
వెలుగు లోకి రావాల్సిన, అభివృద్ధి చేయాల్సిన పర్యాటక ప్రదేశాలు తెలంగాణ లో ఇంకా చాలా ఉన్నాయని, దుర్గం చెరువు  కేబుల్ బ్రిడ్జి కూడా గొప్ప కట్టడం... దీన్ని పెద్ద పండగ లాగా చేసుకోవాలని కోరుతున్న... మన పూర్వికుల సంపద, మనం కాపాడుకుందాం అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు.